![]() |
.webp)
సూపర్ స్టార్ కృష్ణ.. ప్రభంజనం అనే పదం పుట్టిందే కృష్ణ గారి కోసం అయి ఉండవచ్చు. అంతలా తెలుగు సినీ జగత్తులో కొన్ని తరాల పాటు తన ప్రభంజాన్ని చాటి చెప్పారు. తెలుగు సినిమా రూపురేఖల్ని మార్చడంతో పాటు వేగాన్ని కూడా పెంచాడు. అలాంటి ఒక చిత్రమే గూఢచారి 116 . హాలీవుడ్ మేకింగ్ స్టైల్ తో రూపుద్దిద్దుకున్న ఈ చిత్రం కృష్ణ గారి కెరీర్ లో మూడవది కావడంతో పాటు కృష్ణ గారికి ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. గూఢచారి 116 వచ్చి నేటికి 60 సంవత్సరాలు.
కొన్ని సినిమాలు కేవలం బాక్సాఫీస్ విజయాన్ని మాత్రమే అందించవు, అవి ఒక కొత్త శకానికి నాంది పలుకుతాయి. అలాంటి అరుదైన మైలురాయి చిత్రం 'గూఢచారి 116'. 1966లో విడుదలైంది. ఆ కాలంలో ఎక్కువగా పౌరాణికాలు, జానపదాలు, కుటుంబ కథా చిత్రాలు మాత్రమే ఉండేవి. అలాంటిది హాలీవుడ్ లో తెరకెక్కిన ఒక జేమ్స్ బ్యాండ్ చిత్రం మద్రాస్ లోని ఒక థియేటర్ లో ప్రదర్శితమైంది. దీంతో నిర్మాత డుండి గారు తెలుగులో కూడా అలాంటి సినిమాని తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యారు. దాంతో కృష్ణ గారిని హీరోగా ఎన్నుకొని హాలీవుడ్ జేమ్స్ బాండ్ తరహా యాక్షన్ ఎంటర్టైనర్‌ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి, తెలుగు సినిమా గతిని పూర్తిగా మార్చేశారు. ఈ ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ పరిశ్రమలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన కథనం నిజంగానే ఒక అద్భుతం.
అప్పటివరకు రొమాంటిక్ లేదా సాదాసీదా పాత్రలలో కనిపించిన కృష్ణ గారిని ఒక పూర్తిస్థాయి యాక్షన్ హీరోగా, స్టైలిష్ ఏజెంట్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఆ రోజుల్లో ఒక పెద్ద సాహసం. ఒక సినిమాల్లో కృష్ణ గారు రిస్కీ ఫైట్ లో డూప్ లేకుండా బైక్ పై నుంచి కారుపైకి దూకుతాడు.ఆ సన్నివేశం చూసే నిర్మాత డుండి గారు కృష్ణ గారిని గూఢచారికి హీరోగా ఫిక్స్ చేయడం జరిగింది. గూఢచారిలో కూడా డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేయడం, స్పీడ్ డ్యాన్సులు, స్టైలిష్ సుట్‌లు, చేతిలో గన్ పట్టుకుని శత్రువులపై విరుచుకుపడే విధానం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా విజయం తర్వాత కృష్ణ గారిని అభిమానులు "తెలుగు జేమ్స్ బాండ్" అని పిలుచుకోవడం ప్రారంభించారు. మల్లిఖార్జున రావు అత్యంత ప్రతిభావంతంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటి జయలలిత కథానాయికగా నటించి తన గ్లామర్‌తో, నటనతో విశేషంగా అలరించారు. అలాగే శోభన్ బాబు గారు సినిమా ప్రారంభంలో ఒక కీలకమైన గూఢచారి పాత్రలో మెరిసి అలరించారు. ప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు ఎం. విన్సెంట్ అందించిన విజువల్స్, విలన్ల రహస్య స్థావరాలు, నిఘా పరికరాలు, యాక్షన్ సన్నివేశాలు నాటి ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని పంచాయి. అలాగే టి. చలపతిరావు స్వరపరిచిన సంగీతం సినిమాకు ప్రాణవాయువులా నిలిచింది. ముఖ్యంగా నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే' "ఎర్రని పెదవుల దానా", "మనసార నవ్వమ్మ" డీరి డీరి డిరిడి వంటి పాటలు అప్పట్లో మార్మోగిపోయాయి. ప్రతి సన్నివేశంలోనూ ఉత్కంఠను పెంచే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఒక క్లాసిక్‌గా నిలబెట్టింది.
Also read: బాసు.. ఈ రోజు ఆ సీక్రెట్ చెప్పేస్తావా!
ఆ రోజుల్లో పరిమిత బడ్జెట్‌తో నిర్మించినప్పటికీ, 'గూఢచారి 116' సృష్టించిన బాక్సాఫీస్ సంచలనం అసాధారణమైనది. అనేక ప్రధాన కేంద్రాలలో 100 రోజులకు పైగా సక్సెస్ ఫుల్‌గా ప్రదర్శించబడి భారీ వసూళ్లను సాధించింది. నిర్మాణ వ్యయంతో పోలిస్తే ఈ సినిమా సాధించిన లాభాలు ఆ రోజుల్లో ఒక రికార్డు. ఈ సినిమా ఇచ్చిన ధైర్యంతోనే టాలీవుడ్‌లో వరుసగా స్పై థ్రిల్లర్లు, కౌబాయ్ సినిమాలు, యాక్షన్ అడ్వెంచర్ చిత్రాల నిర్మాణం ఊపందుకుంది. కృష్ణ కూడా ఆ తర్వాత 'జేమ్స్ బాండ్ 777', 'ఏజెంట్ గోపి' వంటి అనేక స్పై చిత్రాలలో నటించి తన మార్కెట్‌ను విస్తరించుకున్నారు. 60 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ స్పై థ్రిల్లర్ అనగానే ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తుకొచ్చే పేరు 'గూఢచారి 116'. టాలీవుడ్ చరిత్ర పుటల్లో చెరిగిపోని సంతకం చేసిన ఈ చిత్రం ఎప్పటికీ ఒక అద్భుత సంచలనమే! ఈ చిత్రం తర్వాత డుండి,కృష్ణ గారి కాంబోలో 25 సినిమాలు రావడం రికార్డు. మోసగాళ్లకు మోసగాడు కూడా డుండినే నిర్మించారు. ఆయన పూర్తి పేరు పోతిన డుం డేశ్వరరావు. స్వగ్రామం విజయవాడ కాగా తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటి థియేటర్ మారుతీ టాకీస్ ఓనర్ కూడా.
Krishna, Gudachari116, Dundi, malikharjunarao, jayalalitha
![]() |